: జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది... ఆందోళన వ్యక్తం చేసిన బొత్స
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి ఐదో రోజుకు చేరింది. నిన్నటిదాకా నిలకడగానే ఉన్న జగన్ ఆరోగ్యం, నాలుగు రోజులుగా ఆహారం లేకపోవడంతో క్రమంగా క్షీణిస్తోంది. ఈ మేరకు నేటి ఉదయం జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన గుంటూరు వైద్యులు ఆయన రెండు కిలోల మేర బరువు తగ్గినట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గుంటూరులోని నల్లపాడులో జరుగుతున్న దీక్షా స్థలిలోనే కొద్దిసేపటి క్రితం పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా జగన్ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.