: జగన్ దీక్షను స్వాగతించిన సి.రామచంద్రయ్య... చంద్రబాబు సర్కారుపై నిప్పులు
రాష్ట్ర విభజన రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. స్వపక్షాలు విపక్షాలుగా మారుతుంటే, విపక్షాలు స్వపక్షాలుగా మారిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ జట్టు కట్టాయి. ప్రభుత్వంపై నిరసన తెలిపే విషయంలో ఈ పార్టీలు చేతులు కలిపాయి. గతంలో ఈ తరహా కలయిక ఎన్నడూ చూడలేదు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి బద్ధ శత్రువుగా పేరుపడ్డ కడప జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత సి.రామచంద్రయ్య (గతంలో టీడీపీ, ప్రస్తుతం కాంగ్రెస్) జగన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో జగన్ చేస్తున్న దీక్షను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో నారా చంద్రబాబునాయుడి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. హంద్రీ-నీవా ప్రాజెక్టుకు చెందిన మోటారును పట్టిసీమకు తరలించి ప్రభుత్వం రాయలసీమకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో గద్దెనెక్కిన చంద్రబాబు అధికార దర్పంతో విర్రవీగుతున్నారని కూడా రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చే లోగానే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.