: మొబైల్ ఫోన్ లో మునిగి... కన్న కొడుకును చంపేసుకున్న ఇంగ్లండ్ మహిళ


నిన్నటికి నిన్న ప్రమాదంలో చిక్కుకున్న తాను చనిపోయినా ఫరవా లేదు, తన కొడుకైనా బతకాలన్న కాంక్షతో చిన్నారిని ఒడ్డుకు విసిరేసి చిత్తూరు జిల్లా మహిళ అచ్చమైన తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. ఒక్క రోజు తిరక్కముందే మరో కన్న తల్లి మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. అయితే ఈ మహిళ భారతీయురాలు కాదు. అగ్ర దేశాల్లో ఒకటిగా పేరున్న ఇంగ్లండ్ కు చెందిన నిర్దయురాలు. గతేడాది జరిగిన ఈ ఘటనలో ఆ తల్లి చేజేతులా తన కన్నబిడ్డను చంపేసుకుంది. ఈ ఘటనపై నిన్న లండన్ కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. అసలు ఏం జరిగిందంటే... తూర్పు యార్క్ షైర్ లోని బేవర్లీలో నివసించే క్లెయిర్ బార్నెెెెట్ గతేడాది మార్చిలో ఓ రోజు స్విమ్మింగ్ పూల్ సమీంలోకి రెండేళ్ల కొడుకు జాషువాతో కలిసి వెళ్లింది. పిల్లాడిని అక్కడ వదిలి తాను మాత్రం మొబైల్ లో ఫేస్ బుక్ ఓపెన్ చేసుకుని అందులోనే మునిగిపోయింది. ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు. బాలుడి అలికిడి వినిపించకపోయినా, ఆమెలో అనుమానం రాలేదు. ఫేస్ బుక్ లో లీనమైన ఆమె అసలు బాలుడి వైపు కన్నెత్తి చూడలేదు. ఈలోగా స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిన బాలుడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. చివరికి ఎలాగోలా ఫేస్ బుక్ నుంచి కొడుకు వైపు దృష్టి సారించిన బార్నెట్ పిల్లాడిని తీసుకుని హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు పెట్టింది. అయితే బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనిపై నమోదైన కేసును విచారించిన బ్రిటన్ కోర్టు బార్నెట్ చేసిన పని చైల్డ్ క్రూయాల్టి కిందకే వస్తుందని పరిగణించి ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. విచారణలో భాగంగా అంతకుముందు కూడా ఆమె తన కొడుకు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తేలింది. ఒకానొక రోజు బార్నెట్ తన పనిలో నిమగ్నమై పిల్లాడిని గాలికి వదిలేసింది. అయితే బాలుడు ఆడుకుంటూ రోడ్డు మీదకెళ్లాడు. ఈ క్రమంలో బాలుడి పైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చిందట. అయితే కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో నాడు బాలుడు జాషువా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ రెండు ఘటనలను పరిశీలించిన కోర్టు బార్నెట్ కు శిక్ష సబబేనని వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News