: జగన్ 2 కేజీల బరువు తగ్గారట... ఐదో రోజుకు చేరిన ‘హోదా’ దీక్ష
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి ఐదో రోజుకు చేరింది. గుంటూరులోని నల్లపాడులో ఐదు రోజుల క్రితం దీక్షకు దిగిన జగన్, ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వచ్చే దాకా దీక్ష విరమించేది లేదని ప్రకటించారు. దీక్ష నేపథ్యంలో మూడు రోజులుగా ఆహారం తీసుకోకున్నా ఆయన నిన్నటిదాకా ఏమాత్రం బరువు తగ్గలేదు. అయితే ఆహారం తీసుకోక నాలుగు రోజులు పూర్తి అయిన నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచే జగన్ బరువు తగ్గడం ప్రారంభమైంది. నేటి ఉదయానికి జగన్ 2 కేజీల మేర బరువు తగ్గినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే బీపీ, షుగర్ లెవెల్స్ లో ఎలాంటి మార్పు లేదని వారు తెలిపారు. దీక్ష కొనసాగించేందుకే జగన్ నిర్ణయించుకుంటే ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.