: ఐపీఎల్ స్పాన్సర్ గా పేటీఎం మాతృ సంస్థ...‘వన్97‘, బీసీసీఐల మధ్య ఒప్పందం


విశ్వవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు స్పాన్సర్ గా కొనసాగలేనని ప్రకటించి బహుళ జాతి సంస్థ పెప్సీకో, బీసీసీఐకి షాకిచ్చింది. అయితే పెప్సీకో వెళ్లిపోతే ఏంటీ, నేనున్నానంటూ ముందుకొచ్చింది పేటీఎం మాతృ సంస్థ ‘వన్97’. ఈ మేరకు ఆ సంస్థ బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే బీసీసీఐకి వన్97 సంస్థ చెల్లించాల్సిన సొమ్ముపై చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి గతంలో కుదిరిన ఒప్పందం మేరకు 2013-17 మధ్య కాలానికి స్పాన్సర్ షిప్ పొందిన పెప్సీకో ఇప్పటికే రూ.396 కోట్లు చెల్లించింది. 2016, 2017కు సంబంధించి మరో 160 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెప్సీకో మధ్యలోనే ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో దాని స్థానంలో స్పాన్సర్ బాధ్యతలు తీసుకునే సంస్థ ఈ మొత్తానికి అదనంగా పదో పది శాతాన్ని కలుపుకుని బీసీసీఐకి చెల్లించాల్సి ఉంది. దీనిపైనే వన్97, బీసీసీఐల మధ్య చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చర్చలు ఫలించి, ఈ నెలాఖరు నాటికి కొత్త ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

  • Loading...

More Telugu News