: రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలను ఆ విధంగా భాగస్వాములను చేస్తాం!: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ చారిత్రాత్మక రాజధాని నిర్మాణంలో ఎలా భాగస్వాములను చేయనున్నారన్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు. విజయవాడలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యముండాలి అనే భావంతో దసరా ఉత్సవాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ నెల 13 నుంచి 22 వరకు దసరా వేడుకలు జరుగుతాయని ఆయన చెప్పారు. 13వ తేదీన ప్రతి ఒక్కరూ పూజలు చేసి రాజధాని కోసం గ్రామంలో పవిత్రమైన నీరు, మట్టిని సేకరిస్తారని ఆయన తెలిపారు. దీనికి సంప్రదాయపద్ధతిలో పూజాధికాలు నిర్వహించి, రాజధాని ఉన్నతంగా ఏర్పడాలనే పవిత్రమైన భావనతో ప్రార్థనాలయాల్లో ఉంచుతారని, దానికి రెండు రోజుల పాటు పూజలు చేస్తారని ఆయన చెప్పారు. ఈ రెండు రోజులలో గ్రామస్థులను సంకల్పం రాయాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. 16 వేల గ్రామాల నుంచి నిర్మాణ సంకల్పం రాసిన తరువాత ఈ నెల 14, 15వ తేదీలలో పూజలు నిర్వహించి, 16న ఊరేగింపుగా నియోజక వర్గ కేంద్రమైన మండలం చేరుస్తారని, 17న అక్కడే ఉంచి, రాజధానికి వాటిని 18న తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. ఇచ్చాపురం, కర్నూలు, చిత్తూరు నుంచి ఆరు రూట్లలో రాజధానికి దగ్గర్లో ఒక ప్రాంతంలో ఇవన్నీ కలుస్తాయని ఆయన తెలిపారు. అక్కడ ఆ 16 వేల గ్రామాల నుంచి వచ్చిన మట్టి, నీరుకి ఘనంగా స్వాగతం పలుకుతామని ఆయన చెప్పారు. అక్కడి నుంచి 19వ తేదీ సాయంత్రం ఆ 175 వాహనాలు అమరావతిలో శంకుస్థాపన ప్రాంతానికి చేరుకుంటాయని ఆయన వెల్లడించారు. మట్టిని, నీటిని 20న ఫౌండేషన్ ఏరియాలో కలుపుతామని ఆయన చెప్పారు. ఆ నీటిలో పవిత్ర నదీ జలాలను కలుపుతామని చెప్పారు. ఇందులో రాష్ట్రంలోని ప్రముఖమైన, పవిత్రమైన 150 దేవాలయాలు, చర్చ్ లు, మసీదుల నుంచి మట్టి తెచ్చి అక్కడ కలుపుతామని ఆయన చెప్పారు. ఇలా కలిపిన మట్టిని తీసుకెళ్లి ఫౌండేషన్ లో ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. అలాగే రాజధానిలో ఏ ఫౌండేషన్ ఏర్పాటు చేసినా దానిలో ఈ మట్టిని ఉపయోగిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News