: అమరావతి నిర్మాణం పూర్తి పారదర్శకంగా వుంటుంది!: బాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిని ఓ పద్ధతి ప్రకారం నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అమరావతి నిర్మాణాన్ని పూర్తి పారదర్శకంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యం, పెట్టుబడులతో ప్రపంచం అచ్చెరువొందేలా నిర్మిస్తామని అన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు లేవని ఆయన తెలిపారు. అదే సమయంలో రాజధాని నిర్మాణానికి అవసరమైన అన్ని నిధులను కేంద్రం ఇచ్చే పరిస్థితి లేనందున, రైతుల ప్రోత్సాహానికి న్యాయం జరిగేలా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కార్పొరేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. అమరావతిని 9 క్లస్టర్స్ గా నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఈ 9 క్లస్టర్స్ లో జస్టిస్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, హెల్త్ సిటీ, ఎంటర్ టైన్ మెంట్ సిటీ, నాలెడ్జ్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, అడ్మినిస్ట్రేషన్ హబ్... ఇలా పలు విభాగాలుగా నిర్మిస్తామని ఆయన చెప్పారు. వీటి నిర్మాణానికి సింగపూర్, జపాన్ దేశాలు సహకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రాజధాని నిర్మాణంలో జరిగే ప్రతి అంశం పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.