: ముగ్గురు టీడీపీ నేతల కిడ్నాప్ పై మావోయిస్టుల లేఖ విడుదల
విశాఖలోని జీకే వీధి మండలం, కొత్తగూడ వద్ద ముగ్గురు టీడీపీ నేతలను ఈ నెల 6న మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు మావోల వద్దే బందీలుగా ఉన్నారు ఈ నేపథ్యంలో మావోలు తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఈ లేఖ విడుదలైంది. బాక్సైట్ తవ్వకాల నేపథ్యంలోనే టీడీపీ నేతలను కిడ్నాప్ చేశామని, బాక్సైట్ నిక్షేపాల తరలింపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని టీడీపీ నేతలు బాక్సైట్ కు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఏజెన్సీ బంద్ చేపట్టాలని లేఖలో తెలిపారు. 12న విశాఖ వస్తున్న సీఎం చంద్రబాబును బాక్సైట్ పై నిలదీయాలన్నారు. ఒకవేళ ప్రతికూలత ఏర్పడితే పార్టీ నుంచి వైదొలగాలని మావోలు టీడీపీ నేతలకు స్పష్టం చేశారు.