: ఏపీ సర్కారుకు షాక్...అమరావతి భూమి చదును నిలిపేయాలని ‘గ్రీన్ ట్రైబ్యునల్’ ఆదేశం
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన నేపథ్యంలో ఏపీ సర్కారు వడివడిగా అడుగులేస్తోంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కార్యక్రమ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. శంకుస్థాపనను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించిన సీఎం నారా చంద్రబాబునాయుడు, తమ కేబినెట్ సహచరులతో కలిసి ఏర్పాట్లను రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏపీ సర్కారుకు షాకిచ్చింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి తుళ్లూరు పరిధిలో జరుగుతున్న భూమి చదును పనులను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి రాజధాని ప్రాంతంలో తొలుత గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసిన తర్వాతే పనులు మొదలుపెట్టాల్సి ఉంది. ఈ మేరకు పర్యావరణ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ఏపీ సర్కారు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు హామీ ఇచ్చింది. అయితే గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వం పనులు మొదలుపెట్టిందని ఓ వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశారు. గ్రీన్ కారిడార్ కు విరుద్ధంగా ఏపీ సర్కారు తోటలను తొలగిస్తోందని తన పిటిషన్ లో పేర్కొన్నారు. తన వాదనను బలంగా వినిపించేందుకు అతడు తోటల తొలగింపునకు సంబంధించిన ఫొటోలను కూడా అందజేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ తక్షణమే భూమి చదును పనులు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. అమరావతి శంకుస్థాపనపై ఏపీ కేబినెట్ కీలక భేటీ జరుగుతున్న సమయంలోనే ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం.