: పోస్టుమార్టంకు తరలిస్తుండగా...చనిపోయిందనుకున్న మహిళ కళ్లు తెరిచింది!


ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ లోపలి నుంచి తలుపు గడియపెట్టుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి రెండు రోజులుగా ఆమె కళ్లే తెరవలేదు. తలుపులు బద్దలు కొట్టిన పోలీసులకు ఆ మహిళ నిర్జీవంగానే కనిపించింది. ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె చనిపోయిందని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. తరువాత కార్యక్రమాల్లో భాగంగా ఆటోను పిలిపించి ఆమెను (శవం అనుకున్నారు) అందులోకి చేర్చారు. శరీరాన్ని పట్టుకుని ఏదో వాహనంలోకి ఎక్కిస్తున్న భావన కలగడంతో అప్పటిదాకా కళ్లే తెరవని ఆ మహిళ మేల్కొంది. కళ్లు తెరిచి పరికించి చూసింది. దీంతో షాక్ తిన్న పోలీసులు, స్థానికులు ఆమె చనిపోలేదని నిర్ధారించుకున్నారు. పోస్టుమార్టం బదులు ఆదే ఆటోలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదు శివారులోని గండిమైసమ్మ ప్రాంతంలో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఇప్పనపాడుకు చెందిన కనకదుర్గ భర్తతో కలిసి గండిమైసమ్మ ప్రాంతంలో ఉంటోంది. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో భర్త నుంచి ఛీత్కారాలు భరించలేక కనకదుర్గ వేరు కాపురం పెట్టింది. టైలరింగ్ చేస్తూ బతుకుబండి లాగుతోంది. అయితే ఒంటరితనం ఆమెను కుంగదీసింది. గురువారం పరిమితికి మించి నిద్రమాత్రలు మింగింది. లోపలి నుంచి తలుపు గడియ పెట్టుకుని పడుకుంది. ఎంతకీ తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూసి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం వరకూ ఆమె తల్లిదండ్రులు రాకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టారు. ఇక శవమనుకుని ఆటోకి ఎక్కిస్తుండగా కళ్లు తెరిచన కనకదుర్గ ముఖంపై పోలీసులు నీళ్లు చల్లి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News