: మీడియాతో మాట్లాడే స్వేచ్ఛనూ హరిస్తారా?... పోలీసులపై పొన్నాల ఫైర్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ పీసీసీ) మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతున్న తనను నిలువరించేందుకు యత్నించిన పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలకు మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? అంటూ ఆయన పోలీసులపై విరుచుకుపడ్డారు. రైతు సమస్యలపై సర్కారు వైఖరికి నిరసనగా విపక్షాలన్నీ మూకుమ్మడిగా చేపట్టిన బంద్ సందర్భంగా తెల్లవారుజామునే హైదరాబాదులోని ఎంజీబీఎస్ వద్దకు పొన్నాల కార్యకర్తలతో కలిసి వచ్చారు. ఎంజీబీఎస్ నుంచి బస్సులు బయటకు రాకుండా ఆయన అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతున్న పొన్నాలను పోలీసులు అక్కడి నుంచి తరలించే యత్నం చేశారు. దీంతో పొన్నాల ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. ‘మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ కూడా మాకు లేదా?’’ అంటూ ఆయన పోలీసులను నిలదీశారు. అయినా వినని పోలీసులు మీడియాతో మాట్లాడకుండానే పొన్నాలను అక్కడి నుంచి తరలించారు.