: ఐఎస్ఐఎస్ లో చేరి ఇప్పుడు 'నన్ను రక్షించండి బాబోయ్' అని మొరపెట్టుకుంటున్నాడు
మతోన్మాదుల అడ్డా ఐఎస్ఐఎస్ కు పలువురు భారతీయ యువకులు ఆకర్షితులవుతున్నారు. వీరంతా సోషల్ మీడియా ఎరలో ఐఎస్ఐఎస్ కు చిక్కిన వారే కావడం విశేషం. సోషల్ మీడియాలో పరిచయమైన మిత్రుల ద్వారా ఐఎస్ఐఎస్ పై మక్కువ పెంచుకుని, టర్కీ మీదుగా ఇరాక్ చేరుకున్న ఉత్తరప్రదేశ్ అజంఘఢ్ వాసి ఇప్పుడు 'నన్ను రక్షించండి బాబోయ్' అంటూ మొరపెట్టుకుంటున్నాడు. ఈ మధ్యే కుటుంబ సభ్యులను సంప్రదించి ఎలాగైనా తనను ఇక్కడి నుంచి రక్షించాలని మొరపెట్టుకున్నాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు భద్రతా బలగాలను సంప్రదించారు. అతనిని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన భద్రతాధికారులు, అతనిని ఇరాక్ పంపిన వ్యక్తిపై నిఘా పెట్టారు. కాగా, ఐఎస్ఐఎస్ లో చేరగానే తమకు తుపాకీ ఇచ్చేసి, కనిపించిన వారినందర్నీ కాల్చేయమని చెబుతారని భావించి మీదటే యువకులు ఐఎస్ఐఎస్ లో చేరుతున్నారని గతంలో ఇందులో చేరిన వారు తెలిపారు. ఐసిస్ లో చేరుతామని చెప్పగానే, ముందుగా వారు ఏ దేశానికి చెందిన వారని అడుగుతారు. వారికి మతపరమైన అంశాలపై ఉన్న అవగాహనను, శారీరక దృఢత్వం, మానసిక స్థితిని అంచనా వేస్తారు. కొన్నిసార్లు ఇవేవీ చూడకుండా పని వాళ్లుగా పెట్టుకుంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. వీరు ముస్లిం దేశానికి చెందిన వారు కాకపోవడం ఒక కారణమైతే, భారతీయులంటే ఉన్న అనాసక్తి కూడా మరో కారణం అని వారు పేర్కొన్నారు. పని వాళ్లుగా దుర్భర జీవితం గడపడం లేదా, ఒంటికి బాంబులు తగిలించి శత్రు స్థావరాలపైకి ఉసిగొల్పడం వల్ల అందులో చేరిన విదేశీయులు, విరక్తి కలిగి మళ్లీ స్వదేశం వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ ఇలా శత్రు స్థావరాలపైకి వెళ్లి విజయవంతంగా మరణిస్తే పర్వాలేదు. శత్రువుకి చిక్కారా ఇక అంతే...నరకం నేరుగా చూస్తారు. అంతే కాకుండా ఐఎస్ఐఎస్ పై దాడికి సిరియా మిత్రదేశాలు కదులుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, సిరియా, తాజాగా రష్యా పోరాటం చేస్తున్నాయి. రష్యా చేరడంతో సిరియాలో ఐసిస్ స్థావరాలు ఒక్కొక్కటిగా నేల కూలుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా మరి కొందరు ఐసిస్ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు.