: కాంగ్రెస్ కు ఓటేయకుండా నకరాలు చేస్తే, తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తాం: కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
రైతు భరోసా యాత్రలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇస్తే, ప్రజలంతా టీఆర్ఎస్ కు ఓట్లేశారని మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నికలు త్వరలో జరుగుతాయని, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేయకుండా నకరాలు చేస్తే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లో కలిపేస్తామని అన్నారు. దీంతో వేదికపై ఉన్న జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు అవాక్కయ్యారు. పక్కనే ఉన్న ఓ నేత ఏం మాట్లాడుతున్నావు? అని హెచ్చరించడంతో, 'ఎలా కలిపేస్తామండీ? సరదాగా అంటున్నా అంతే' అని సర్దిచెప్పుకున్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో టీఆర్ఎస్ నేతలకు దీంతో సరైన అస్త్రం దొరికింది. దీంతో టీఆర్ఎస్ నేతలు ఒంటికాలిపై లేచారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఎలాంటి కుట్రలు చేస్తోందో తెలుస్తోందంటూ మండిపడింది. కాంగ్రెస్ అసలు రంగును బలరాం నాయక్ వ్యాఖ్యలతో ప్రజలు గుర్తిస్తారని విమర్శించారు. దీంతో తాజాగా బలరాం నాయక్ మరోసారి మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ లో కలిపేసిన ఆరు మండలాలు వెనక్కి తెస్తామని చెప్పబోయి అలా చెప్పానని, ప్రజలు దానిని తప్పుగా భావిస్తే, క్షమాపణలు అడిగేందుకు సిద్ధమని ప్రకటించారు.