: 2019లో అధికారం మాదే...ఇప్పటి మంత్రులంతా జైలుకే: మధుయాష్కీ
2019లో తెలంగాణలో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందని ఆ పార్టీ నేత మధుయాష్కీ గౌడ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులుగా అధికారం వెలగబెడుతున్నవారంతా జైలుపాలు కాక తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లబొల్లి కబుర్లతో దొంగ రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలని అసెంబ్లీలో అడిగిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి రైతులంటే చులకన అని, వారికి మేలు చేయడం కేసీఆర్ కి ఇష్టం లేదని ఆయన విమర్శించారు. రేపు విపక్షాలు పిలుపునిచ్చిన బంద్ ను తెలంగాణ ప్రజలు విజయవంతం చేయాలని ఆయన సూచించారు. లేని పక్షంలో గడీల రాజ్యాన్ని తెలంగాణ ప్రజలు చూడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.