: ఉస్మానియా, కాకతీయ వర్శిటీలకు చాన్స్ లర్ గా టీఆర్ఎస్ అధినేత, తెలుగు వర్శిటీకి చినజీయర్ స్వామి!
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలో యూనివర్శిటీ ఛాన్స్ లర్ కానున్నారు. ప్రసిద్ధ ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీలకు ముఖ్యమంత్రి చాన్స్ లర్ బాధ్యతలు స్వీకరించవచ్చని సమాచారం. కేసీఆర్ తో పాటు తెలంగాణలోని మిగతా వర్శిటీలకు చినజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు వంటి వారిని కులపతులుగా నియమించనున్నట్టు సమాచారం. కాగా, యూనివర్శిటీలకు చాన్స్ లర్ గా ఇంతవరకూ రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు వహిస్తూ, క్షేత్రస్థాయి పర్యవేక్షణ కోసం వైస్ చాన్స్ లర్ లను నియమిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల యూనివర్శిటీల చట్టాన్ని సవరించిన రాష్ట్ర ప్రభుత్వం ఛాన్స్ లర్ పదవుల నుంచి గవర్నర్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. చాన్స్ లర్ పదవికి నిర్ణీత విద్యార్హతలుండాలన్న నిబంధననూ పక్కనబెట్టిన తెలంగాణ ప్రభుత్వం కొత్త చాన్స్ లర్ బాధ్యతలను వేరేవాళ్లకు అప్పగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీల ఛాన్స్ లర్ బాధ్యతలను ముఖ్యమంత్రి స్వీకరిస్తారని ప్రభుత్వ వర్గాల కథనం. అలాగే, తెలుగు యూనివర్శిటీకి జీయర్ స్వామిని, జేఎన్టీయూకు మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావులను నియమించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది.