: ఐపీఎల్ తో ఐదేళ్ల బంధానికి పెప్సీ ఫుల్ స్టాప్!


ప్రపంచ టీ-20 పోటీల గతిని మార్చిన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మరో టైటిల్ స్పాన్సర్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. గడచిన ఐదేళ్లుగా ఐపీఎల్ టైటిల్ ను స్పాన్సర్ చేస్తున్న పెప్సీ ఇకపై ఆ బాధ్యతలు తమకొద్దని బీసీసీఐకి స్పష్టం చేసింది. తదుపరి పోటీలకు తాము స్పాన్సర్ గా ఉండలేమని, క్రికెట్ పాడైపోయిందని తెలిపింది. పెప్సీ కాంట్రాక్టు 2017తో ముగియనుండగా, రెండేళ్ల ముందే తాము తప్పుకోవాలని భావిస్తున్నట్టు ఆ సంస్థ తెలిపిందని బీసీసీఐ వర్గాలు సైతం స్పష్టం చేశాయి. అయితే, విదేశాల్లో జరుగుతున్న పలు పోటీలకు స్పాన్సర్ గా ఉన్నందునే ఐపీఎల్ వద్దని పెప్సీ భావిస్తున్నట్టు క్రికెట్ పెద్దలు చెబుతున్నారు. పెప్సీ నుంచి మరేదైనా సంస్థకు టైటిల్ స్పాన్సర్ హక్కులను బదిలీ చేస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. తమ వద్ద పెప్సీ బ్యాంకు గ్యారంటీ ఉందని, అయినప్పటికీ, సంస్థ కోరిక మేరకు మరో కంపెనీని ఎంపిక చేయాలని భావిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. కాగా, ఈ వార్తలపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందస్తూ, పెప్సీ తప్పుకోవడం పెద్ద విషయమేమీ కాదని అన్నారు. ఈ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News