: విభజన చట్టం చేసినప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా?: వెంకయ్య


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి వెంకయ్య నాయుడు దీటుగా స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన మండిపడ్డారు. పునర్విభజన చట్టం చేసినప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా? అని సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంలో హోదా అంశాన్ని నాడు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. హోదాపై కాంగ్రెస్ కు ప్రశ్నించే హక్కుంది కానీ, విమర్శించే అర్హత లేదని వెంకయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 18 నెలలే అయిందని, విభజన చట్టంలోని హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. ఏపీకి హోదా ఇవ్వడంతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావన్నారు. హోదా అంశాన్ని నీతీ అయోగ్ పరిశీలిస్తోందని పునరుద్ఘాటించారు. దేశంలో ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలు ఇంకా సహాయం కావాలని అడుగుతున్నాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News