: కార్యకర్త చెంప ఛెళ్లుమనిపించిన డీఎంకే నేత స్టాలిన్... సోషల్ మీడియాలో వీడియో హల్ చల్
డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు, ఆ పార్టీలో కీలక నేత అయిన స్టాలిన్ మరోసారి వార్తల్లో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది ఓటర్లను కలవాలనే ఉద్దేశంతో ఆయన చేపట్టిన కార్యక్రమం చివరకు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కోయంబత్తూరు సమీపంలో డీఎంకే కార్యకర్తల మధ్య ఆయన వెళుతూ ఉన్న సందర్భంలో, ఓ కార్యకర్త దగ్గరగా వచ్చి స్టాలిన్ తో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశారు. తన మొహానికి ఆ వ్యక్తి అడ్డుగా రావడంతో, ఆగ్రహానికి గురైన స్టాలిన్ సదరు వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించారు. అంతేకాదు, అతన్ని వెనక్కి తోసేశారు కూడా. ప్రస్తుతం ఈ వీడియో వాట్స్ యాప్ తో పాటు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్టాలిన్ మేనేజర్లు స్పందిస్తూ, ఆ వ్యక్తిని స్టాలిన్ కొట్టలేదని, కేవలం తన చుట్టూ ఉన్న అభిమానులను క్లియర్ చేసే క్రమంలోనే ఇది జరిగిందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఈ ఉదయం చోటు చేసుకుంది.