: మీరు మమ్మల్ని దాటుతారా?... ఇండియాకు అంత సీను లేదంటున్న చైనా
అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీలకు తదుపరి వ్యాపారావకాశాలను ఇండియా అందిస్తుందని, ఇప్పటివరకూ చైనా అనుభవిస్తున్న స్థానాన్ని భారత్ సొంతం చేసుకునే రోజు దగ్గర్లోనే ఉందని అమెరికన్ మీడియాలో వస్తున్న కథనాలపై చైనా మండిపడింది. చైనాను ఇండియా అధిగమించే అవకాశాలే లేవని వ్యాఖ్యానించిన అధికార పత్రిక, అసలు ఆ ఊహే వృథా అని వివరించింది. ఐదేళ్ల నాడు చైనా ఉన్న పరిస్థితికి, టెక్నాలజీకి కనీసం దగ్గరగా కూడా ఇండియా ఇప్పుడు లేదని ఓ ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. అంతకుముందు "ఇండియా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ అమెరికన్ కంపెనీలతో సమావేశమైన తరువాత పలు కంపెనీలు చైనాతో పోలిస్తే, ఇండియావైపే మొగ్గు చూపాయి" అని 'న్యూయార్క్ టైమ్స్' వ్యాఖ్యానించింది. 'గ్లోబల్ టైమ్స్' సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇండియా వంటి దేశాల్లో వివిధ రకాల చెల్లింపులు, రాష్ట్రాల మధ్య పన్ను వ్యత్యాసాలు అమెరికన్ కంపెనీలకు ఆసక్తికరంగా మారాయని తెలిపింది. దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చైనా పత్రిక "అలా జరిగే వీలే లేదు. మోదీ 'డిజిటల్ ఇండియా' ఏమాత్రమూ పునాదుల్లేని మాటలు మాత్రమే. ఈ అంశంలో ఐదేళ్ల క్రితం చైనా దరిదాపుల్లో కూడా ప్రస్తుత ఇండియా లేదు" అని తెలిపింది. ప్రపంచంలో ఇంటర్నెట్ వ్యవస్థ మెరుగుపడటానికి చైనాయే కారణమని వివరిస్తూ, ఏమాత్రం మౌలిక వసతులు, ఉత్పత్తి రంగంలో అభివృద్ధి లేకుండా ఇండియా తమతో పోటీ పడాలని కలలు కంటున్నదని విమర్శించింది. ఒక్క హార్డ్ వేర్ మినహా, లాజిస్టిక్స్, మాన్యుఫాక్చరింగ్ వంటి కీలక రంగాల్లో ఇండియా ఎన్నో సంవత్సరాల వెనుకంజలో ఉందని, జనాభా సంఖ్య పరంగా, ఇంటర్నెట్ వాడకం పరంగా ఆ దేశంలో అత్యధిక అవకాశాలు ఉన్నాయన్నది మాత్రం నిజమని, కేవలం దాని కారణంగానే చైనాను ఇండియా అధిగమిస్తుందనడం హాస్యాస్పదమని అభిప్రాయపడింది.