: ఎంజీఆర్ కే పంగనామాలు పెట్టిన చరిత్ర జయలలితది: విజయకాంత్
పురచ్చితలైవిగా తమిళ తంబిలచే కీర్తింపబడుతున్న జయలలిత అంటే... అన్నా డీఎంకే పార్టీ నేతలకే కాదు, విపక్ష సభ్యులకు సైతం భయమే. సాక్షాత్తు డీఎంకే అధినేత కరుణానిధినే అర్ధరాత్రి అరెస్టు చేయించిన ఘనత ఆమెది. అలాంటి జయపై డీఎండీకే అధినేత విజయకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఎండగట్టారు. కేవలం ప్రజలనే కాకుండా, దివంగత ఎంజీఆర్ ను సైతం జయలలిత మోసం చేశారంటూ ఆరోపించారు. అంతటి వ్యక్తికే ఆమె పంగనామాలు పెట్టారని విమర్శించారు. దీనికి సంబంధించిన లేఖ కూడా తన వద్ద ఉందని బాంబు పేల్చారు. జయ పాలనలో అరాచకాలు, అవినీతి పెచ్చరిల్లాయని విజయకాంత్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సూపర్ అంటూ జయ చెబుతుంటే... పోలీసు భద్రతపై తమకు నమ్మకం లేదంటూ సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం, అసలు వాస్తవాన్ని చెబుతోందని అన్నారు. ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు ఇస్తారని... ఆ సొమ్మంతా ప్రజలదే అని, దాన్ని తీసుకుని ఓటు మాత్రం మంచివారికి వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో జయను, ఆమె పార్టీని తరిమి కొట్టాలని ఓటర్లను కోరారు. ప్రధాన మంత్రి మోదీతో కూడా జయకు సంబంధాలు లేవని... కేవలం పరిపాలనాపరమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు.