: ఐఐటీ అగ్ర ర్యాంకులు మనవి, సీట్లు మాత్రం రాజస్థాన్ వి!
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో చదవాలన్నది లక్షలాది మంది కోరిక. ప్రవేశ పరీక్షలు జరిపినప్పుడు ర్యాంకుల్లో ముందు నిలిచిన ఆంధప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు అదే స్థాయిలో ప్రవేశాలు పొందడంలో మాత్రం ఈ సంవత్సరం విఫలమయ్యారు. మొత్తం 18 ఐఐటీల్లో 9,974 సీట్లు ఈ ఏడు అందుబాటులోకి రాగా, ఏపీ నుంచి 776 మంది, తెలంగాణ నుంచి 770 మందికి మాత్రమే ప్రవేశాలు దక్కాయి. రాజస్థాన్ రాష్ట్రం నుంచి 1,965 మంది ప్రవేశాలు పొందగా, ఉత్తరప్రదేశ్ 1,259 మంది విద్యార్థులతో రెండో స్థానంలో నిలిచింది. గ్రామీణ యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం 25 శాతం సీట్లను హిందీ మీడియంలో ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేసిన గ్రామీణ విద్యార్థులకు కేటాయించారు. మొత్తం 900 మంది విద్యార్థినులు ఐఐటీల్లో ప్రవేశం పొందారు. మొత్తం సీట్లను పొందిన విద్యార్థుల్లో 888 మంది తల్లిదండ్రులు రైతులు కాగా, 466 మంది పేరెంట్స్ ఇంజనీర్లని, డాక్టర్లకు చెందిన 232 మంది పిల్లలు సీట్లు పొందారని ఐఐటీ అధికారులు తెలిపారు. 1,600 మంది విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్ష లోపేనని, వీరిలో 1,100 మంది తండ్రులు 10వ తరగతి వరకే చదువుకున్నారని, ప్రవేశాలు పొందిన 900 మంది విద్యార్థుల తల్లిదండ్రులు నిరక్షరాస్యులని వివరించారు.