: గులాబీ నేతలకు దసరా ధమాకా... నామినేటెడ్ పదవులిస్తామన్న కేసీఆర్
గులాబీ పార్టీ టీఆర్ఎస్ ఏళ్ల పాటు పోరు సాగించి రాష్ట్రం సాధించుకుంది. కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడే 16 నెలలు కూడా గడిచిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసినా, కొత్త రాష్ట్రంలో ఇంకా నామినేటెడ్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ పదవుల పందేరంపై పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాయిదాల పర్వానికే ఓటేస్తున్నారు. తాజాగా నిన్న జరిగిన టీఆర్ఎస్ఎల్పీ భేటీలోనూ కేసీఆర్ మరోమారు ఈ అంశంపై నోరు విప్పారు. దసరాకు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్న ఆయన ప్రకటనతో గులాబీ నేతల్లో ఉత్సాహం పొంగింది. పదవులను చేజిక్కించుకునేందుకు అప్పుడే ఎవరికి వారు తమ యత్నాలను ముమ్మరం చేశారు. దీంతో పార్టీలో నేతలంతా బిజీబిజీగా మారిపోయారు. ఎక్కడ చూసినా ఈ పదవులపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి ఈ సారైనా కేసీఆర్ పదవులను భర్తీ చేస్తారో, లేక నేతల ఉత్సాహంపై నీళ్లు చల్లుతారో చూడాలి.