: ఫ్రాన్స్ లో వేసుకున్న డ్రెస్ తోనే ఢిల్లీ సదస్సుకు వెంకయ్య...ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సదస్సుకే!
క్రమశిక్షణ, సమయపాలనకు పెట్టింది పేరు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఏ పని చేసినా పక్కా ప్రణాళికతోనే కాక అనుకున్న సమయానికి ప్రారంభించడం ఆయనకు అలవాటు. ఈ లక్షణమే సుదీర్ఘ కాలం పాటు ఆయనను బీజేపీలో అగ్రస్థాయి నేతగా నిలబెట్టిందని చెప్పాలి. వెంకయ్య నిబద్ధతకు నిదర్శనంగా నిన్న ఓ ఘటన జరిగింది. నిన్న ఢిల్లీలో స్మార్ట్ సిటీలపై జరిగిన ఓ సదస్సుకు వెంకయ్య సూటు బూటుతో వచ్చారు. నిత్యం అచ్చమైన తెలుగు వస్త్రధారణ పంచెకట్టులో కనిపించిన ఆయన ఇకపై సూటు బూటులోనూ కనిపిస్తారని కూడా పలువురు అనుకున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే, తొమ్మిది రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత వెంకయ్యనాయుడు ఇంటికెళ్లకుండా నేరుగా సదస్సుకే వచ్చారట. దీంతోనే ఆయన నిన్న ఢిల్లీలో సూటు బూటులో కనిపించారట. 9 రోజుల పర్యటన 8 రోజుల్లోనే ముగియడంతో ఇక అక్కడ ఉండటం ఎందుకని భావించిన వెంకయ్య మొన్న రాత్రి రిటర్న్ ఫ్లైట్ ఎక్కేశారు. నిన్న ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. ఇక అప్పటికే ఫిక్కీ నిర్వహిస్తున్న సదస్సు మరికాసేపట్లో ప్రారంభమవుతుందని తెలుసుకున్న ఆయన ఇంటికెళ్లకుండా నేరుగా సదస్సుకే వెళ్లారు. అక్కడ అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ లో వేసుకున్న చొక్కా, స్వెట్టర్ లతోనే వెంకయ్య సదస్సుకు హాజరయ్యారు. ఓ వైపు ఎండలు మండుతుంటే, ఈయనేంటి స్వెట్టర్ వేసుకున్నారని సదస్సుకు హాజరైన వారు గుసగుసలాడుతుండటాన్ని గమనించిన వెంకయ్య అసలు విషయం చెప్పడంతో వారు విస్తుపోయారు.