: ఇదో వింత... ఫ్లెక్సీకి అంత్యక్రియలు!
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విచిత్రం చోటుచేసుకుంది. ఓ ఫ్లెక్సీకి అంత్యక్రియలు నిర్వహించారు. కూరగాయల వ్యాపారి సత్యనారాయణ నేటి ఉదయం మృతి చెందారు. అయితే సత్యనారాయణ భార్య, పెద్ద కుమారుడు క్రైస్తవ మతం స్వీకరించారు. చిన్న కుమారుడు హిందూమతంలో ఉన్నాడు. దీంతో కుమారులిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. తమ మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామంటే... తమ మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఎవరికీ వారు పట్టుబట్టారు. అయితే సత్యనారాయణ పెద్ద కుమారుడు, భార్య క్రైస్తవులు కావడంతో వారి మత సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహించి, మృతదేహాన్ని ఖననం చేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. తరువాత చిన్న కుమారుడు తన తండ్రి ఫ్లెక్సీని చేయించి, దానిపై దండలు పెట్టి హిందూ శ్మశానవాటికకు బాజాభజంత్రీలతో తీసుకెళ్లి, ఆ ఫ్లెక్సీకి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. ఫ్లెక్సీకి అంత్యక్రియలు నిర్వహించడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేసిన పిఠాపురం వాసులు, రెండు మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు.