: ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉండలేం... ప్రస్తుతానికి ఢిల్లీ వెళ్తాం!: అఖ్లఖ్ కుటుంబం


ఉత్తరప్రదేశ్ లోని దాద్రి గ్రామంలో గోమాంసం తిన్నాడని ఆరోపిస్తూ మహ్మద్ అఖ్లఖ్ అనే వ్యక్తిని స్థానిక బీజేపీ నేత కుమారుడు, అతని అనుచరులు హత్య చేసిన సంగతి తెలిసిందే. తండ్రి హత్యకు గురైన అనంతరం అఖ్లఖ్ పెద్ద కుమారుడు ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో ఉంటే రాజకీయాల కారణంగా విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉండడం సరికాదని, ఇలాంటి సున్నితమైన అంశాలపై అంతా బాధ్యతతో ప్రవర్తించాలని పేర్కొన్నారు. అలాగే కుటుంబ సభ్యులంతా చూస్తుండగా తన తండ్రిని హత్య చేసిన ఇంటిలో నివసించడం చాలా కష్టమైన అంశమని పేర్కొన్నాడు. తన సోదరుడు చికిత్స పొందుతున్నందున, కుటుంబాన్ని ప్రస్తుతానికి ఢిల్లీ తీసుకువెళ్తానని ఆయన అన్నారు. భవిష్యత్ పై తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. దీనిపై మహ్మద్ అఖ్లఖ్ సోదరుడు జమిల్ మాట్లాడుతూ, తర తరాలుగా ఇదే గ్రామంలో ఉంటున్నామని, ఉన్నపళంగా గ్రామాన్ని వదలలేమని చెప్పారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు. దీని కారణంగా గ్రామం వదలడం లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News