: వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు కస్టమర్లకు చేర్చని బ్యాంకులపై ఆర్బీఐ ఆగ్రహం


తొలుత వడ్డీ రేట్లను తగ్గించాలని ఒత్తిడి తెచ్చి, ఆపై వడ్డీలను తగ్గించిన తరువాత, ఆ ప్రయోజనాలను కస్టమర్ల దరికి చేర్చని బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగ్రహంతో ఉంది. ఇటీవలి పరపతి సమీక్ష అనంతరం రెపో రేటును అర శాతం మేరకు తగ్గిస్తూ, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తన నిర్ణయాన్ని ప్రకటించగా, ఒక్క బ్యాంకు కూడా రుణాలపై ఆ మేరకు వడ్డీ రేట్లను తగ్గించలేదు. దేశంలోని అతిపెద్ద బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 బేసిస్ పాయింట్లు, అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ 35 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇతర బ్యాంకులు సైతం 25 నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకూ మాత్రమే వడ్డీ తగ్గింపును ప్రకటించాయి. ఇదే ఇప్పుడు ఆర్బీఐ ఆగ్రహానికి కారణం. తమ మార్జిన్లపై ప్రభావం పడుతుందన్న కారణాన్ని బ్యాంకులు భూతద్దంలో చూపుతున్నాయని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ అందించే వెసలుబాటును తక్షణం కస్టమర్లకు అందించాల్సిన బ్యాంకులు ఇలా చేయడం తగదన్నది అత్యధికుల అభిప్రాయం. ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీలను వసూలు చేస్తుండటంపై విమర్శలు పెరుగుతున్నాయి. కాగా, బ్యాంకులు అమలు చేస్తున్న వివిధ రకాల రుణ స్కీముల గురించిన పూర్తి సమాచారం, వసూలు చేస్తున్న వడ్డీ రేట్ల వివరాలను తెలుసుకోవాలని ఆర్బీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గడచిన మూడేళ్లలో బ్యాంకులకు వస్తున్న నికర వడ్డీల మార్జిన్లు గణనీయంగా తగ్గిపోయాయని, నిరర్థకంగా మారుతున్న ఆస్తుల విలువ పెరుగుతున్న నేపథ్యం, రుణవృద్ధి మందగిస్తున్న తరుణంలో బ్యాంకుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నది ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి బ్యాంకుల వాదన. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) రెపో రేటు తగ్గగా, ఏ బ్యాంకు కూడా 0.70 శాతానికి మించి వడ్డీ తగ్గింపును ప్రకటించలేదు. ఆర్బీఐ నిర్ణయాలకు, బ్యాంకుల పోకడలకూ పొంతన ఉండకపోవడంతో కస్టమర్లు నష్టాల పాలు కావాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారి ఆర్బీఐ నిర్ణయాలకు అనుగుణంగా వడ్డీ రేట్ల తగ్గింపు ఉండాలన్నది సగటు రుణగ్రస్తుడి చిరు కోరిక!

  • Loading...

More Telugu News