: నెట్ కనెక్షన్ లేకుండానే పనిచేసే 'హైక్ మెసెంజర్'!
ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ హైక్ మెసెంజర్ వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త ఆఫర్ ప్రకటించింది. ఇటీవలే వందమందితో గ్రూప్ కాల్ చేసుకునే సౌకర్యాన్ని హైక్ కల్పించింది. ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే హైక్ మెసెంజర్ వాడుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు హైక్ సీఈవో కవిన్ భారతి మిట్టల్ తెలిపారు. తమకు 7 కోట్లమంది వినియోగదారులున్నారని చెప్పిన మిట్టల్, ఇప్పటికీ దేశంలో చాలామంది స్మార్ట్ ఫోన్ వాడకందారులకు నెట్ కనెక్షన్ ఉండట్లేదని అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నెట్ అవసరం లేకుండానే తమ యాప్ ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వైఫై, మొబైల్ డేటా లేకుండానే ఫోటోలు, స్టిక్కర్లు, ఫైళ్లు, మెసేజ్ లను ఇతర హైక్ మెసెంజర్ వాడకందారులకు కూడా పంపుకోవచ్చని వివరించారు. వాటితో పాటు 70 ఎంబీ పరిమాణంలో ఉండే పెద్ద ఫైళ్లను కూడా 10 సెకన్లలో పంపేయవచ్చన్నారు.