: రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వకుంటే మోదీ నకిలీ ఓబీసీ అవుతారు: లాలూ
రిజర్వేషన్లకు వ్యతిరేకమా? అనుకూలమా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ వ్యతిరేకిస్తే, ప్రధాని నకిలీ ఓబీసీ అవుతారని లాలూ అన్నారు. బీహార్ లో ఇవాళ మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో లాలూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. దళితులకు, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశాన్ని సమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సూచించినా మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. మోదీని పదవి నుంచి దింపి తాను ప్రధాని కావాలని అమిత్ షా కలలు కంటున్నారని ఆరోపించారు. బీహార్ ను అభివృద్ధి చేస్తామని తెగ చెప్పుకుంటున్న బీజేపీ, అలాంటప్పుడు స్కూటీలు, టీవీలు, ల్యాప్ టాప్స్ ఇస్తామని ఎందుకు ప్రచారం చేస్తోందంటూ విమర్శించారు. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ పై విమర్శలు చేసిన లాలూ... దళితులు, ఓబీసీలను బానిసలుగా ఉంచటమే వారి ప్రధాన ఎజెండా అని వ్యాఖ్యానించారు.