: దేశంలోనే మొదటిసారిగా... విజయవాడ నెహ్రూ బస్ స్టేషన్ లో డిజిటల్ థియేటర్లు
నిరర్థక ఆస్తులను ఉపయోగించుకుని ఆదాయం పొందాలనుకుంటున్న ఏపీఎస్ ఆర్టీసీ ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్ బీఎస్)లో ఇకపై సినిమాలు చూసే సౌకర్యాన్ని ప్రయాణికులకు కల్పించనుంది. ఎప్పటినుంచో బస్ స్టేషన్ లో మినీ థియేటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన ఉంది. ఈ క్రమంలో, అప్సిమ్ ఇండియా సంస్థ అధునాతన టెక్నాలజీతో బస్ స్టేషన్ లో రెండు డిజిటల్ థియేటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వెంటనే అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం పాప్యులర్ అయిన ఐనాక్స్ వంటి థియేటర్ల తరహాలో వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా లోబడ్జెట్ లో ప్రేక్షకులకు సినిమా చూపించేందుకు సిద్ధమయ్యారు. ఈ థియేటర్లు విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన బస్ స్టేషన్లు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న బస్ స్టేషన్లలో కూడా ఇటువంటి థియేటర్లనే ఏర్పాటు చేయించాలనుకుంటున్నారు. బస్ స్టేషన్ లోని అరైవల్ బ్లాక్ లో 1932 నాటి దక్కన్ క్వీన్ బస్సు ఉన్న ప్రాంతాన్ని రెండు సినిమా థియేటర్ల నిర్మాణానికి ఇచ్చారు. ఇప్పటికే అపిమ్స్ తమకు కేటాయించిన ప్రాంతంలో థియేటర్ పనులు ప్రారంభించింది. లోపల సౌండ్ బయటకు వినిపించకుండా అధునాతన టెక్నాలజీతో సివిల్ వర్క్స్ చేస్తున్నారు. అద్భుతమైన ఇంటీరియర్, డిజిటల్ డాల్బీ సరౌండ్ సిస్టమ్, స్క్రీన్, అధునాతన సీటింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. అప్సిమ్ ఇండియా... కాఫీ టాకీస్ తో కలిపి ఈ రెండు థియేటర్లను నిర్మిస్తోంది. ఒక్కో థియేటర్ ను 130 సీటీంగ్ కెపాసిటీతో రూపొందిస్తోంది. సినిమా టికెట్ రూ.80తో ప్రేక్షకులను లోపలికి అనుమతించాలని నిర్వాహకులు నిర్ణయించారు. వచ్చే జనవరిలో సంక్రాంతి పండుగ నాటికి సినిమా చూపించాలన్న సంకల్పంతో ఉన్నారు.