: నరసింహన్ తో నాగం భేటీ... అసెంబ్లీలో ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత నాగం జనార్దన్ రెడ్డి భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని రాజ్ భవన్ కు వెళ్లిన నాగం గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో లెక్కకు మిక్కిలి జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై ఆయన గవర్నర్ తో చర్చించారు. అంతేకాక రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదని కూడా ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. నిన్న ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.