: గద్వాలలో లంకె బిందె... బిందెలో వజ్రాలు: పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్ ఇదే!


మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో లంకె బిందెల కోలాహలం నెలకొంది. కాలువ తవ్వకాల్లో దొరికిన లంకె బిందెలో పెద్ద సంఖ్యలో వజ్రాలు ఉన్నాయన్న విషయంపై నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సదరు లంకె బిందెను చూసేందుకు పట్టణవాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు కూడా భారీగా తరలివస్తున్నారు. వివరాల్లోకెళితే... పట్టణంలో ఇటీవల మొదలైన కాలువల తవ్వకాల్లో బాగంగా పురాతన కాలానికి చెందిన ఓ పెద్ద బిందె బయటపడింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పట్టణం మొత్తం పాకిపోయింది. చివరకు రెవెన్యూ అధికారుల చెవికీ ఈ సమాచారం చేరింది. దీంతో రంగప్రవేశం చేసిన రెవెన్యూ అధికారులు సదరు లంకె బిందెను స్వాధీనం చేసుకున్నారు. అయితే బిందెలో ఏమున్నాయన్న విషయంపై అటు దానిని గుర్తించిన కూలీలు కానీ, రెవెన్యూ అధికారులు కానీ నోరు విప్పడం లేదు. ఇవేమీ పట్టని అక్కడి ప్రజలు లంకె బిందెలో తప్పనిసరిగా వజ్రాలు ఉండే ఉంటాయని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్క గద్వాలలోనే కాక మొత్తం పాలమూరు జిల్లావ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ లా మారింది.

  • Loading...

More Telugu News