: రైతన్నపై తెల్లదోమ పగ... మూడింట రెండు వంతుల పత్తి నాశనం!
రైతులపై తెల్లదోమ పగబట్టింది. పెరల్ హార్బర్ చిత్రంలో జపాన్ సైన్యం అమెరికాపై దాడి చేసినట్టుగా ఒక్కసారిగా పత్తి పంటపై పడి తీవ్ర నష్టాన్ని కలిగించింది. దేశంలో అత్యధికంగా పత్తిని పండించే రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న పంజాబ్ రైతాంగం... ఈ సీజనులో తెల్లదోమ దెబ్బకు మూడింట రెండు వంతుల పొలాల్లో పత్తి పంటను కోల్పోయింది. దీంతో, మొత్తం రూ. 4,200 కోట్ల నష్టం వాటిల్లిందని భటిందా జిల్లాలో విత్తనాలు, పురుగుమందులు విక్రయించే డీలర్ నరేష్ కుమార్ లెహ్రీ తెలిపారు. రైతులకు పురుగుమందు చల్లుకునే సమయం కూడా తెల్లదోమ ఇవ్వలేదని వివరించారు. కాగా, మంచి దిగుబడి వస్తుందనుకున్న పత్తి రైతులు తెల్లదోమ పంటను నాశనం చేయడం చూసి తట్టుకోలేక, 15 మంది వరకూ ఆత్మహత్యలు చేసుకున్నారు. నాసిరకం క్రిమి సంహారకాలు వాడటం కూడా పంట నాశనం కావడానికి ఓ కారణం అని రైతులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న అకాలీదళ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ. 640 కోట్లను పరిహారంగా విడుదల చేసినప్పటికీ, అది చాలదని, పూర్తి పరిహారం తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు. మొత్తం 12 లక్షల ఎకరాల్లో ఈ సంవత్సరం పత్తి పంటకు పూనుకున్న రైతుల్లో దాదాపు అందరూ బీటీ కాటన్ రకాన్నే ఎంచుకున్నారు. ఈ రకం కొన్ని క్రిములను ఎదుర్కోవడంలో ముందు నిలుస్తుంది. ఈ సంవత్సరం సబ్సిడీకి ప్రభుత్వం పురుగుమందులను సరఫరా చేయాలని నిర్ణయించడమే రైతుల కొంపముంచిందని పలువురు వాపోయారు. తక్కువ ధరలకు వస్తున్నాయని ప్రభుత్వం అందించిన రసాయనాలు కొని చల్లడం, వాటిల్లో నాణ్యత లోపం కారణంగానే తెల్లదోమ విజృంభించిందని తెలుస్తోంది.