: భారత వాయుసేన అడుగుతుంటే, కాదు పొమ్మంటున్న మోదీ సర్కారు!
కాలం చెల్లిన మిగ్ తరహా యుద్ధ విమానాల స్థానంలో అత్యాధునిక విమానాలను అందించాలని భారత వాయుసేన చేస్తున్న ప్రతిపాదనలకు మోదీ సర్కారు అడ్డుకట్ట వేసింది. డిమాండు మేరకు 36 యుద్ధ విమానాలను 'దస్సాల్ట్ ఏవియేషన్' నుంచి కొనుగోలు చేయాలని మిలిటరీ కోరగా, అందుకు నిరాకరించిన కేంద్రం, దేశంలో తయారైన 'తేజస్' విమానాలతో సర్దుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇండియాలో రక్షణ రంగంపై ఆధారపడ్డ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ, మేకిన్ ఇండియా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఇకపై విదేశీ యుద్ధ విమానాల కొనుగోలు వద్దని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మేకిన్ ఇండియా విధానం బాగున్నప్పటికీ, తేజస్ విమానాల తయారీ మాత్రం దాదాపు 3 దశాబ్దాలుగా సాగుతోంది. ఇప్పటికీ వాటి భద్రత, పనితీరుపై నెలకొన్న అనుమానాలు తొలగలేదు. దీంతో భారత వాయుసేనకు కొత్త దిగులు పట్టుకున్నట్లయింది. 1962లో చైనాతో జరిగిన యుద్ధం తరువాత ఇండియా స్వీయ యుద్ధ విమానాల తయారీకి నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తేజస్ తేలికపాటి విమానాల తయారీకి నిర్ణయించింది. ఇప్పటికింకా పూర్తి స్థాయిలో తేజస్ సిద్ధం కాకపోగా, ఇకపై విదేశీ ఆయుధాల పట్ల మక్కువ పెంచుకోవద్దని మోదీ సర్కారు తేల్చి చెప్పింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఉన్న ఇండియాపై ఆశలు పెట్టుకున్న దస్సాల్ట్ ఏవియేషన్, రఫాలే వంటి విదేశీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. కాగా, రఫాలే తయారు చేస్తున్న మల్టీరోల్ ఎయిర్ క్రాఫ్ట్ లను కొనుగోలు చేసేందుకు మాత్రం మోదీ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ఆయన 36 రఫాలే ఫైటర్ జట్స్ కొనుగోలుకు డీల్ కుదుర్చుకున్నారు. భారత వాయుసేన కనీస అవసరాలు తీర్చేందుకు తగ్గట్టుగా విమానాలను సమకూర్చాల్సి ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. మరిన్ని విదేశీ విమానాల కొనుగోలుకు నిధులు అధికంగా కావాల్సి ఉన్నందున, ఇండియాలో తయారయ్యే విమానాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో అటు పాకిస్థాన్, ఇటు చైనాలతో పోరాడాల్సి వస్తే, భారత వాయుసేనకు 45 ఫైటర్ స్క్వాడ్రన్స్ అవసరం ఉండగా, ఇప్పుడు కేవలం 35 మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. వీరు సోవియట్ యూనియన్ కాలంనాటి మిగ్ 21 విమానాలనే అధికంగా వాడుతున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా మూలన పడుతుండటంతో 2022 నాటికి 25 స్క్వాడ్రన్లు మాత్రమే మిగిలే పరిస్థితి నెలకొంది. ఈలోగా లోటును పూడ్చే చర్యలు తీసుకుంటే చాలని, అవి దేశవాళీ విమానాలైనా, విదేశీ విమానాలైనా తమకు ఒకటేనని వాయుసేన చెబుతోంది.