: చదువు చెప్పేందుకు టీచర్లు కావాలని కోరితే ఖాకీల కిరాతకం!


తమకు ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేస్తుంటే, ఖాకీలు తమ కర్కశత్వాన్ని చూపిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే, చురు గ్రామంలో 300 మందికి పైగా విద్యార్థులున్న ఓ పాఠశాలకు నిబంధనల ప్రకారం 22 మంది ఉపాధ్యాయులు ఉండాలి. కానీ ఏడుగురే ఉన్నారు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో తమకు మరింతమంది టీచర్లను ఇవ్వాలని 14 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న సుమారు 100 మంది అమ్మాయిలు స్కూలు ముందు నిరసన చేపట్టారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన నలుగురు స్థానిక పోలీసులు వారిని విచక్షణారహితంగా కొట్టారు. చున్నీలు లాగేశారు. ఎక్కడపడితే అక్కడ తాకుతూ, సారాయి ప్యాకెట్లను వారిపై విసిరారు. పలువురు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన గత వారం జరుగగా, పోలీసులు కొట్టిన దెబ్బలకు ఇప్పటికీ కోలుకోని వారు కూడా ఉన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. ఒక పోలీసు అధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్ ఘటనపై నిస్పాక్షిక విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలావుండగా, కొందరు టీచర్లు, కొంతమంది తల్లిదండ్రులపై పోలీసులు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సామాజిక కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. వారిపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలని, క్రూరంగా ప్రవర్తించిన పోలీసులను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News