: ఉగ్రవాదుల కాల్పుల్లో నేలకొరిగిన 'సైబర్ బాయ్'


ఉగ్రవాదుల కిరాతకానికి భరతమాత మరో ముద్దుబిడ్డ నేలకొరిగారు. కాశ్మీరులో ఉగ్రవాదులను అణచి వేసే చర్యల్లో భాగంగా చేపట్టే కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాల్లో ఆరితేరిన సబ్ ఇన్ స్పెక్టర్ అల్తాఫ్ అహ్మద్ బందీపోర్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పులకు బలయ్యారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ సెక్యూరిటీ ఏజన్సీలకు తగిలిన పెద్ద దెబ్బగా పోలీసు అధికారులు అభివర్ణిస్తున్నారు. ఆయన మరణాన్ని మీడియాకు వెల్లడిస్తూ, రాష్ట్ర డీజీపీ కే రాజేంద్ర కుమార్ కన్నీరు కార్చారంటే, కాశ్మీర్ పోలీసులకు అల్తాఫ్ ఎంతగా దగ్గరయ్యారో, ఎంతగా ప్రభావితం చేశారో తెలుస్తోంది. లష్కరే తోయిబా కమాండర్, పాకిస్థాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టు అబూ ఖాసిమ్ గురించిన సమాచారం తెలియడంతో అతన్ని మట్టుబెట్టేందుకు తన ఇద్దరు కొలీగ్ లతో కలసి అల్తాఫ్ ఈ ఉదయం వెళ్లారు. ఉధంపూర్ లో ఆగస్టు 5న జరిగిన దాడి వెనుక ప్రధాన సూత్రధారి అబూ ఖాసిమ్ కావడంతో, అతన్ని హతమార్చి మిగిలిన ఉగ్రవాదులకు పాఠం నేర్పడమే ఆ సమయంలో అల్తాఫ్ మదిలో ఉన్న ఏకైక ఆలోచన. ఖాసిమ్ ఉన్న ప్రాంతానికి చేరుకోవడానికి కొంచెం ముందుగా, ఓ ప్రయాణికుల వాహనం వెనకున్న ఉగ్రవాది, అల్తాఫ్ పై అకస్మాత్తుగా దాడి చేసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆర్మీ హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఓ కానిస్టేబుల్ గా చేరిన అల్తాఫ్ అనతికాలంలోనే ప్రమోషన్లు పొందారు. జమ్మూ పోలీసులు అల్తాఫ్ ను 'సైబర్ బాయ్'గా పిలుచుకునేవారు. టెర్రరిస్టు ఇంటర్నెట్ నెట్ వర్కులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటి ద్వారా ఉగ్రవాదుల అనుపానులు గుర్తించి, సడన్ దాడులకు ప్రణాళికలు రూపొందించి, వాటిని విజయవంతం చేయడంలో అల్తాఫ్ సిద్ధహస్తుడు. ఏ ఉగ్రవాదైనా మొబైల్ ఫోన్ వాడితే, వాటిని ఇట్టే పట్టేసేవారు. కాలు పెడితే, ముష్కరుల అంతు చూడనిదే వెనక్కు రాని అల్తాఫ్ మృతి పట్ల కాశ్మీరమంతా విలపిస్తోంది. రాష్ట్రపతి పోలీసు మెడల్ తో పాటు ఎన్నో సాహస అవార్డులను అందుకున్న అల్తాఫ్ దక్షిణ కాశ్మీర్ లోని కుల్గాం నివాసి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గడచిన 10 సంవత్సరాల్లో జమ్మూలో జరిగిన వందలాది ఎన్ కౌంటర్లు, మిలిటెంట్ల అరెస్టుల వెనుక వ్యూహ రచనలో పాల్గొన్న అల్తాఫ్ కు ఇప్పుడు ఆశ్రునయనాలతో నివాళులు అర్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News