: బాధ్యత గల అధికారిగానే వ్యవహరించా... కేసు కొట్టేయమని హైకోర్టుకు ఐఏఎస్ శ్రీలక్ష్మి అభ్యర్థన
‘‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు బాధ్యత కలిగిన అధికారిగా వ్యవహరించా... సీబీఐ నాపై తప్పుడు అభియోగాలతో నమోదు చేసిన కేసు కొట్టేయండి’’ అని అక్రమ గనుల కేటాయింపు కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి హైకోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు నిన్న హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆమె తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. కడప జిల్లాలో ఓ సంస్థకు కేటాయించిన గనులను దాల్మియా సిమెంట్స్ కు బదలాయింపునకు శ్రీలక్ష్మి అనుకూలంగా వ్యవహరించి ఆయాచిత లబ్ధి చేకూర్చారని సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తన తప్పిదం ఎంతమాత్రం లేదని శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఈ పిటిషన్ పై జరిగిన విచారణ సందర్భంగా ఆమె తరఫు న్యాయవాది ఆసక్తికర వాదన చేశారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తన క్లయింట్ బాధ్యత గల అధికారిగా మాత్రమే అమలు చేశారని కోర్టుకు చెప్పారు. ఇందులో తన క్లయింట్ సొంత నిర్ణయాలేమీ లేవని కూడా ఆయన కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో మైనింగ్ చట్టంలోని నిబంధనలను శ్రీలక్ష్మి ఉల్లంఘించారన్న సీబీఐ వాదనలో వాస్తవం లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.