: టాలీవుడ్ లోనూ ‘రియల్ హీరో’...రైతు సంక్షేమ నిధికి రూ.50 వేలిచ్చిన నాగశౌర్య


సాగు కలిసిరాక అప్పుల్లో కూరుకుపోతున్న అన్నదాత ఉరికంబమెక్కుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. బతుకు భారంగా మారిన అన్నదాతకు బాసటగా నిలిచేందుకు బాలీవుడ్ హీరోలు నానా పటేకర్, అక్షయ్ కుమార్ లు ముందుకొచ్చారు. ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ నానా పటేకర్ దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరతీశారు. ఇక గుట్టుచప్పుడు కాకుండానే రైతన్నలకు ఆపన్నహస్తం అందిస్తున్న అక్షయ్ కుమార్ ఉదంతం కూడా సెలబ్రిటీలను ఆలోచనలో పడేసింది. తెలంగాణలో లెక్కకు మిక్కిలి జరుగుతున్న రైతు ఆత్మహత్యలను ఆపేందుకు ముందుకొచ్చే ‘రియల్ హీరో’ టాలీవుడ్ లో ఒక్కరూ లేరా? అంటూ ఇటీవల ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ప్రత్యేక కథనాన్ని రాసింది. దీనికి టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య (ఊహలు గుసగుసలాడే ఫేం) స్పందించాడు. ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం ఏర్పాటు చేసిన ‘రైతు సంక్షేమ నిధి’కి అతడు రూ.50 వేలను అందించాడు. ఈ మేరకు నిన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సదరు మొత్తానికి సంబంధించిన చెక్కును నాగశౌర్య అందజేశాడు.

  • Loading...

More Telugu News