: చంద్రబాబుకు షాక్...సీనియర్ ఐఏఎస్ సతీశ్ చంద్ర కేటాయింపును తప్పుబట్టిన కేంద్రం


రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపునకు సంబంధించి ఏపీ సర్కారుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏరికోరి తెచ్చుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సతీశ్ చంద్ర కేటాయింపునకు సంబంధించి కేంద్రం నిన్న ఆసక్తికర వాదనను వినిపించింది. ఏపీ కేడర్ కు సతీశ్ చంద్రను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిందేనని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యూనల్ (క్యాట్) కు చెప్పింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సతీశ్ చంద్ర తెలంగాణ కేడర్ కు కేటాయించబడ్డారు. అయితే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సతీశ్ చంద్ర సీఎంఓలో కీలక అధికారిగా పనిచేశారు. పదేళ్ల తర్వాత మరోమారు సీఎం పీఠం దక్కించుకున్న చంద్రబాబు తన కార్యాలయంలో సతీశ్ చంద్ర ఉండాల్సిందేనని భావించారు. ఈ క్రమంలో సతీశ్ చంద్ర ఏపీ కేడర్ కు బదిలీ అయ్యారు. దీనిపై నమోదైన వ్యాజ్యంపై నిన్న క్యాట్ లో విచారణ జరిగింది. సతీశ్ చంద్రను ఏపీ కేడర్ కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం నిర్దేశిత మార్గదర్శకాలకు విరుద్ధమేనని ఈ విచారణ సందర్భంగా కేంద్రం వ్యాఖ్యానించింది. స్వాపింగ్ విధానానికి విరుద్ధంగా జరిగిన ఈ కేటాయింపును ఇతర అధికారులు తమ న్యాయపర హక్కుగా భావించరాదని కేంద్రం చెప్పింది.

  • Loading...

More Telugu News