: ‘తోక’ ఎమ్మెల్యే టీడీపీ ఎంట్రీకి బ్రేకులు పడ్డాయట!


‘ఎమ్మెల్యే పదవి తోక లాంటిది. త్వరలోనే కత్తిరించుకుంటాను’ అంటూ ప్రకటించిన వైసీపీ నేత, కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ ఎంట్రీకి దాదాపుగా బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది. వైసీపీ పార్టీ టికెట్ పై గెలుపొందిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకుంటానంటూ ఇటీవల ఆదినారాయణరెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆదినారాయణరెడ్డికి సుదీర్ఘకాలంగా ప్రత్యర్థిగా కొనసాగుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం వద్ద తన నిరసనను వ్యక్తం చేశారు. ఆదినారాయణరెడ్డి ప్రకటన వెంటనే నేరుగా హైదరాబాదు వచ్చిన రామసుబ్బారెడ్డి పార్టీ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో భేటీ అయ్యారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకుంటే తాను పార్టీ వీడతానని ఆయన తెగేసి చెప్పారు. ఆ తర్వాత పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి ముందు కూడా ఆయన ఇదే వాదనను వినిపించారు. ఈ క్రమంలో దీనిపై లోతుగా ఆలోచించిన పార్టీ అధిష్ఠానం ఆదినారాణరెడ్డి ఎంట్రీపై కాస్తంత వెనక్కు తగ్గింది. పార్టీలోని అందరూ ఆమోదం తెలిపితేనే ఆదినారాయణరెడ్డి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించిందట. ఈ విషయంలో ఎంతమాత్రం తొందరపడరాదని కూడా అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News