: సెల్ఫీలు తీసుకున్నారు... ఉద్యోగాలు కోల్పోయారు!
విచక్షణ మరచి, బాధ్యతారాహిత్యంతో చేయాల్సిన పనులను కూడా వదిలిపెట్టి సెల్ఫీలు తీసుకుంటే ఏమవుతుంది? అసలుకే ఎసరొస్తుంది. ఇందుకు ఈ సంఘటనే నిదర్శనం. గత ఆగస్టు 22న షోర్హామ్ ఎయిర్ షో లో ఒక విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. సహాయక చర్యల నిమిత్తం అక్కడికి వెళ్లిన పోలీసులు వారివారి పనుల్లో నిమగ్నమైపోయారు. కానీ, ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ ఆనందించారు. పైగా, వాటిని సామాజిక మీడియాలో పెట్టారు. దీంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. విమర్శల వర్షం కురిపించారు. ఈ సమాచారం క్రమంగా పోలీసు అధికారుల చెవికి చేరింది. అంతే వారి ఉద్యోగాలపై వేటు పడింది.