: ట్విట్టర్, ఫేస్ బుక్ లో పుకార్లకు సౌదీలో ఇక మరణశిక్ష!
ట్విట్టర్, ఫేస్ బుక్ లో పుకార్లు రేపితే భారత దేశంలో ఏమీ కాదు. మత విద్వేషాలు రెచ్చగొడితే అరెస్టు చేస్తారు. కానీ కఠిన చట్టాలకు నెలవైన సౌదీ అరేబియాలో మాత్రం సోషల్ మీడియాలో పుకార్లు రేపితే మరణశిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలపై ఎన్నో ఆంక్షలు అమలు చేస్తున్న సౌదీ అరేబియా తెచ్చిన కొత్త నిబంధన నెటిజన్లను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. సౌదీ కొత్త రాజు చేసిన ఈ చట్టంపై హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. హజ్ యాత్ర తొక్కిసలాటకు సౌదీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సౌదీ రాజు ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఇప్పటివరకు చిన్న చిన్న తప్పులు చేసిన వారికి ఖైదు, గృహనిర్బంధం, ప్రయాణ నిషేధం వంటి శిక్షలు విధిస్తున్న సౌదీ ప్రభుత్వం, పుకార్లపై ఒక్కసారిగా మరణశిక్ష విధిస్తామని అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని చేసినట్టు కొన్ని వారాల క్రితం పదవి చేపట్టిన 79 ఏళ్ల సౌదీ కొత్త రాజు సల్మాన్ వెల్లడించారు. ఈ చట్టం వెనుక అతని కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉన్నట్టు సమాచారం.