: హాలీవుడ్ స్టార్ హీరోల 'పెళ్లి' ముచ్చట!
హాలీవుడ్ స్టార్ నటులు హ్యూ జాక్ మన్, జార్జ్ క్లూనీ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. 'ఎక్స్ మెన్' సిరీస్ లో నటించిన హ్యూ జాక్ మన్ తన తాజా చిత్రం విడుదల సందర్భంగా ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఇందులో 'మీరు ఆడపిల్లగా పుట్టి ఉంటే ఎవరిని వివాహమాడేవారు?' అని ప్రశ్నించారు. దీంతో అవాక్కైన జాక్ మన్ 'ఇలాంటి ప్రశ్న అడుగుతారని ఊహించలేద'ని అన్నాడు. 'అయినా మా ఆవిడను అడిగారా? నేను ఆడపిల్లగా మారడాన్ని ఇష్టపడుతుందో? లేదో?' అని ఎదురు ప్రశ్నించాడు. తర్వాత కాసేపు ఆలోచించి, 'నేనే గనుక ఆడపిల్లనై ఉంటే జార్జ్ క్లూనీని వివాహం చేసుకుని ఉండేదాని'ని అన్నాడు. ఇప్పుడు దీనిపై జార్జ్ క్లూనీ మాట్లాడుతూ, 'జాక్ మన్ అప్పుడు జాక్ ఉమన్ అవుతుంది. అప్పుడు పెళ్లాడడంలో అభ్యంతరం లేదు. కానీ, నా భార్య ఒప్పుకుంటుందంటావా?' అని అన్నాడు. ఈ ఆసక్తికర సంభాషణ ఈ హాలీవుడ్ నటుల అభిమానులను అలరించింది.