: ఆ రెండూ మినహా ఆధార్ ఇక దేనికీ వర్తించదు: స్పష్టంగా చెప్పిన సుప్రీం
ప్రభుత్వ సబ్సిడీ ప్రత్యక్షంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లే వంట గ్యాస్, చౌక ధరల దుకాణాలకు మినహా మరే ఇతర పథకాలకు ఆధార్ సంఖ్య తప్పనిసరి కానే కాదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ సంఘాలు ఆధార్ ను తప్పనిసరి చేయాలని ఎందుకు అడుగుతున్నాయో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ట్రేడింగ్ లో పాల్గొనాలంటే అవసరమయ్యే డీమ్యాట్ ఖాతా, ట్రేడర్ రిజిస్ట్రేషన్లకు ఆధార్ ను తప్పనిసరి చేస్తే, కేవైసీ నిబంధనలను సులువుగా పాటించినట్లవుతుందని, ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని సెబీ, సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం అందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావద్దని వెల్లడించింది. ఆధార్ ఎంతమాత్రమూ తప్పనిసరి కాదని, మిగతా కార్డుల మాదిరే దాన్ని కూడా ఓ గుర్తింపు కార్డుగా భావించాలే తప్ప, దాని కోసం ప్రజలపై ఒత్తిడి తేవద్దని పేర్కొంది. భవిష్యత్తులో అవసరమైతే తమ తీర్పును సమీక్షిస్తామని తెలిపింది.