: టీఆర్ఎస్ కు చరమ గీతం పాడాలని రేవంత్ రెడ్డి పిలుపు
రాష్ట్రంలో రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు నిరోధించేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పాతిపెట్టాలని, చరమ గీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలో టీడీపీ, బీజేపీ నేతలు చేపట్టిన పాదయాత్రలో రేవంత్ మాట్లాడారు. రాష్ట్రాన్ని ప్రపంచబ్యాంకుకు తాకట్టు పెడితే టీఆర్ఎస్ ను ఎండగడతామన్నారు. పోలీసులకు వాహనాలు ఇచ్చి ఈ ప్రభుత్వం తమను కొట్టిస్తోందని, టీఆర్ఎస్ నేతలు గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని రేవంత్ ప్రజలకు చెప్పారు. తెలంగాణ కోసం ఏనాడు పోరాటం చేయని వారికి కేసీఆర్ మంత్రి పదవులిచ్చారని, అదే తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదండరాంను మాత్రం వదిలేశారని అన్నారు. ఉద్యమకారులపై ఒకప్పుడు రాళ్లు విసిరిన కొండా సురేఖ ఇప్పుడు సీఎంకు ఆప్తులయ్యారని విమర్శించారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.