: ఏపీ ప్రజలపై మరో భారం... త్వరలో ఆర్టీసీ వడ్డన!
ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరో భారం పడనుంది. ఇప్పటికే ఏడాదికి రూ. 600 కోట్ల నష్టంలో సాగుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను గట్టెక్కించేందుకు ప్రయాణికుల టికెట్ చార్జీలను పెంచాలని భావిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు స్వయంగా వెల్లడించారు. చార్జీల పెంపుపై క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉదయం విజయవాడలోని ఆర్టీసీ హౌస్ లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చార్జీల పెంపుపై చర్చించింది. ఈ సమావేశానికి శిద్ధాతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. సమావేశం తదుపరి శిద్ధా మాట్లాడుతూ, ఏపీఎస్ ఆర్టీసీని మరింతగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించినట్టు వివరించారు. చార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రికి నివేదిస్తామని, తుది నిర్ణయాన్ని ఆయన తీసుకుంటారని తెలిపారు. ఆర్టీసీకి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను లీజుకు ఇచ్చే విషయాన్ని సైతం చర్చించామని తెలియజేశారు.