: జూనియర్ ‘దూత్’లు వచ్చారు!... టెక్ దిగ్గజంగా ఎదుగుతున్న వీడియోకాన్
ఎలక్ట్రానిక్ గృహోపకరణాల్లో పేరొందిన దేశీయ కంపెనీ ‘వీడియోకాన్’ సమీప భవిష్యత్తులో టెక్నాలజీ దిగ్గజంగా రూపాంతరం చెందడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే, ప్రస్తుతం ఆ కంపెనీ బాధ్యతలన్నీ జూనియర్ ‘దూత్’ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. నందన్ లాల్ మహదేవ్ లాల్ దూత్ స్థాపించిన ఈ కంపెనీని నిన్నటిదాకా ఆయన కుమారులు వేణుగోపాల్ దూత్, రాజ్ కుమార్ ఎన్.దూత్, పీఎన్ దూత్ లు పర్యవేక్షించారు. తాజాగా వీరి పుత్రరత్నాలు అనిరుధ్ దూత్, అక్షయ్ దూత్, సౌరభ్ దూత్ లు కంపెనీ బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అక్షయ్ దూత్ ఉరకలెత్తే నవయవ్వనంలో ఉన్న 23 ఏళ్ల యువకుడు. ఇతడే కంపెనీలో అందరి కంటే పిన్న వయస్కుడు కూడా. ఇప్పటిదాకా తమకున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ను కాపాడుకుంటూనే ‘స్మార్ట్’ బాట పట్టనున్నామని అతను ధీమాగా చెబుతున్నారు. త్వరలోనే దేశీయంగా తయారైన స్మార్ట్ ఉపకరణాలను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ దిశగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ పై భారీగా ఖర్చుపెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే స్మార్ట్ ఉపకరణాల రంగంలో ఉన్న మల్టీ నేషనల్ కంపెనీ ఉత్పత్తుల కంటే కాస్తంత అధిక ధరలే పలకనున్న తమ ఉత్పత్తులు మెరుగైన పనితీరు కనబరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని అక్షయ్ బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు.