: నేడు పెను ప్రళయం, భూమి వినాశనం: బల్లగుద్ది చెబుతున్న 'ఈ-బైబిల్ ఫెలోషిప్'
'ఎండ్ ఆఫ్ ది వరల్డ్'... ఈ సబ్జెక్టుపై ఎన్నో విశ్లేషణలు జరిగాయి. ఎన్నో చిత్రాలు వచ్చాయి. భూమి వినాశనం, పెను ప్రళయం, మానవాళి అంతం... వంటి పదాలు ఎన్నోమార్లు విన్నాం. 2000 సంవత్సరంలో డిసెంబర్ 31న భూమి అంతరిస్తుందని, ఆపై మాయన్ క్యాలెండర్ ప్రకారం 2012లో... ఇలా పలుమార్లు వార్తలను విన్నాం, చదివాం. కానీ ఈ దఫా 'ఈ-బైబిల్ ఫెలోషిప్' పేరిట నడుస్తున్న ఓ క్రిస్టియన్ సంఘం కొత్త వాదనతో వచ్చింది. నేడు, అంటే అక్టోబర్ 7న పెను ప్రళయం సంభవించి, భూమి వినాశనం అవుతుందని ప్రకటించింది. నేడు దేవుడు కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాడని ప్రచారం చేస్తోంది. గత నెలలో వచ్చిన సూపర్ బ్లడ్ మూన్ ఇందుకు సాక్ష్యమని 'ఈ-బైబిల్ ఫెలోషిప్' వ్యవస్థాపకుడు మెక్ కాన్ బల్లగుద్ది చెబుతున్నారు. 'నోహా' కాలంలో జల ప్రళయాన్ని సృష్టించి భూమిని ప్రక్షాళన చేసిన దేవుడు, ఈ దఫా మరో రూపంలో రానున్నాడని, అది 'నిప్పు' కావచ్చని అంటున్నారు. కాగా, ఇదే గ్రూప్ గతంలో మే 21, 2011న భూమి అంతరిస్తుందని ప్రకటించి భంగపడింది.