: యూపీలో విడి సిగరెట్ల అమ్మకాలపై నిషేధం... అమ్మినట్టు తెలిస్తే జరిమానా, జైలు శిక్ష
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడి సిగరెట్ల అమ్మకాలను తీవ్రంగా పరిగణిస్తోంది. విడి సిగరెట్ల అమ్మకాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిషేధించింది. ఎవరైనా అమ్మితే, దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని తెలిపింది. ప్రభుత్వం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా, గవర్నర్ రామ్ నాయక్ ఆమోదించారు. దాని ప్రకారం ఏ వ్యక్తయినా విడిగా సిగరెట్లు అమ్మినట్టు సంబంధిత అధికారులు గుర్తిస్తే వెయ్యి రూపాయల జరిమానా, ఏడాది జైలు శిక్ష అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేగాక ఒకసారి ఈ శిక్షకు గురైన వ్యక్తి మళ్లీ అదే నేరం చేస్తే రూ.3వేల జరిమానా, మూడేళ్ల శిక్ష ఉంటుందని చెప్పారు. అంతేకాదండోయ్, విడిగా సిగరెట్లు తయారుచేసేవాళ్లకు కూడా శిక్ష వేయనున్నారు. వారికి పదివేల జరిమానా, ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూపీ ఆరోగ్య శాఖ తెలిపింది.