: ఆసుపత్రి బెడ్ పై సిద్ధూ... 'డౌన్, బట్ నాటౌట్' అంటూ ట్వీట్
సిక్సర్ల సిద్ధూగా ఖ్యాతిగాంచిన టీమిండియా మాజీ సభ్యుడు, మాజీ ఎంపీ, బీజేపీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అనారోగ్యానికి గురయ్యాడు. డీప్ వీన్ త్రోంబోసిస్ (డీవీటీ) సమస్యతో బాధపడుతున్న సిద్ధూ న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. సిరల్లో రక్తం గడ్డ కట్టుకున్న కారణంగా సంక్రమించే ఈ వ్యాధి ప్రాణాంతకమైనదేనట. అయితే సకాలంలోనే సిద్ధూ ఆసుపత్రికి వచ్చారని, ప్రస్తుతం ఆయనకు ప్రమాదమేమీ లేదని వైద్యులు ప్రకటించారు. ఇక ఆసుపత్రి బెడ్ పై నుంచే సిద్ధూ ఆధ్యాత్మికత బాట పట్టాడు. ‘‘డౌన్, బట్ నాటౌట్. ప్రాణాంతక వ్యాధి (డీవీటీ) వచ్చింది. దేవుడి దయతో కోలుకుంటా. జీవితం సున్నితమైనది. దాన్ని ప్రార్థనతో హ్యాండిల్ చేయాలి’’ అని అతడు ట్వీట్ చేశాడు. అంతేకాక ఆ కామెంట్ తో పాటు చికిత్స తీసుకుంటున్న తన ఫొటోను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.