: జగన్ ‘హోదా’ దీక్ష నేడే...కనకదుర్గ దర్శనానంతరం దీక్ష ప్రారంభించనున్న వైసీపీ అధినేత
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటులో కూరుకుపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీ టీడీపీ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుంటే, విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రత్యేెక హోదా’ కోసం నేటి నుంచి నిరవధిక దీక్షకు దిగుతున్నారు. గుంటూరులోని నల్లపాడులో నేటి ఉదయం 10.30 గంటలకు జగన్ దీక్ష ప్రారంభం కానుంది. హైదరాబాదు నుంచి నేటి ఉదయం 9 గంటలకు విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆయన బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అనంతరం ఆయన గుంటూరుకు బయలుదేరతారు. జగన్ దీక్షకు సంఘీభావంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ దీక్షలకు దిగుతారు.